పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం జూలై 17న “ఇందూర్ రణభేరి”: బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ ప్రకటించారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఈ నెల జూలై 17 (శుక్రవారం) ఉదయం 10 గంటలకు, నిజామాబాద్ పాత కలెక్టరేట్‌లోని ధర్నా చౌక్ వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇందూర్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు.
రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని, ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏడాది సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, 4.5 లక్షల మంది విద్యార్థులు తమ ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల విద్య కోసం అవసరమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు.
స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా ఫీజులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడం బాధాకరమని అన్నారు.
జూలై 17న నిర్వహించే “ఇందూర్ రణభేరి” కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కులాచారి దినేష్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, కార్పొరేటర్ శ్రవణ్, బీజేపీ ఐటీ జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, బీజేపీ నాయకులు అంబదాస్ రావు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్, విపుల్ రావు, రాజ్ గణేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

























