ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత” – ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
SIR ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామి కావాలి.. ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
మోపాల్, జూలై 17:రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.
మోపాల్, ముదక్‌పల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను గురువారం ఎమ్మెల్యే పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు డబుల్ ఓట్లు, షిఫ్టింగ్, మరణించిన వారి ఓట్ల తొలగింపు వంటి అంశాలపై అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 85 శాతం మేర SIR ప్రక్రియ పూర్తికావడం అభినందనీయమని అన్నారు. మిగిలిన అర్హులైన ప్రతి ఓటరిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం బీజేపీపై ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ, బీజేపీ కేవలం ఓటు చోరీకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంలో కూడా దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాయని తెలిపారు.
ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా SIR ప్రక్రియలో పాల్గొని తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల అప్రమత్తతతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, ప్రతి ఓటు అమూల్యమైనదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

























