“వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. పల్లెలకు వెయ్యి కష్టాలు!”
నిధులు నిల్.. అభివృద్ధి, సంక్షేమం కిల్..!
కాంగ్రెస్ కాలసర్పం పల్లె ప్రగతిని కాటేస్తోందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం…
రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ పల్లెలు ఒట్టిబోతున్నాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి.. వెయ్యి రోజులు గడిచినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాక్లూర్ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి జరగని పల్లె లేదని, సంక్షేమం అందని ఇల్లు లేదని అన్నారు. పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాలను అభివృద్ధి చేశామని చెప్పారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసిందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. చెత్తాచెదారం, దోమలు, పందుల విహారంతో గ్రామాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు.
రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, యూరియా విషయంలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. చెరువులు ఎండిపోతున్నాయని, సాగునీటి జలాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కేసీఆర్ హయాంలో ప్రతి పంచాయతీకి చెత్త సేకరణ ట్రాక్టర్లు, మొక్కలకు నీరు అందించేందుకు ట్యాంకర్లు, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం నిధుల కొరతతో ట్రాక్టర్లు, ట్యాంకర్లు మూలన పడుతున్నాయని ఆరోపించారు.
మిషన్ భగీరథను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా పరిస్థితి కూడా మారిపోయిందని జీవన్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్ పాలనలో కరెంట్ సరఫరా రెప్పపాటు ఆగినా అది వార్త.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
అలాగే రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో మళ్లీ చంద్రబాబు కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పల్లెల అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పోవాలి.. మళ్లీ కేసీఆర్ రావాలి అంటూ పల్లెల్లో ప్రజలు నినదించే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























