ఆటో కార్మికుల ఆకలి కేక.. కాంగ్రెస్‌పై బిగాల భీకర పోరాటం!
420 హామీలు.. 6 గ్యారెంటీలు.. ఆటో కార్మికులకు మాత్రం మొండిచేయి అంటూ బీఆర్ఎస్ నేత గణేష్ బిగాల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు…
నిజామాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని ఎన్నికల హామీలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.
ఆదివారం నగరంలోని ప్రధాన వీధుల గుండా ఆటో కార్మికులతో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పాలన కుప్పకూలిందని, ప్రజా సమస్యలు తీవ్రరూపం దాల్చాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని బిగాల ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని ఆరోపించారు. దీంతో ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.36 వేల వరకు బకాయి పడిందని పేర్కొంటూ.. ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఫ్రీ బస్సు పథకం కారణంగా ఆటో కార్మికుల ఆదాయం తగ్గిపోయిందని, వారికి పరిహారం అందిస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో ఆటోలు, ఇతర రవాణా వాహనాలకు రోడ్డు ట్యాక్స్ విషయంలో మినహాయింపులు కల్పించామని, ప్రస్తుత ప్రభుత్వం ఆటో కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని బిగాల ఆరోపించారు.
కేవలం ఆటో కార్మికులే కాకుండా రైతులు, మహిళలు, యువతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పింఛన్లు పెంచుతామని, ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల విషయంలోనూ ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
నిజామాబాద్ నగరంలోని ప్రజా సమస్యలు, పారిశుధ్య లోపాలపై కూడా బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతోందని గణేష్ బిగాల తెలిపారు. హైమదీ బజార్‌లోని నూతన మార్కెట్‌లో దుర్గంధం నెలకొందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇప్పటికే మహిళల సమస్యలపై ధర్నా, బైక్ ర్యాలీలు నిర్వహించామని.. ఇప్పుడు ఆటో కార్మికులకు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇంతకాలం వేచి చూశారని, వెయ్యి రోజులు గడిచినా పాలనలో ఆశించిన మార్పు కనిపించడం లేదని బిగాల అన్నారు. ప్రజల తరఫున పోరాడే నిజమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలుస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఆటో కార్మికుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడుతామని బిగాల హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

























