24 గంటల్లో బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు
సంగారెడ్డిలో బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగింత…
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీని నిజామాబాద్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే గుర్తించారు. ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ గ్రామంలో బాలుడిని సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్యపరీక్షలు, చట్టపరమైన ప్రక్రియల అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి బాలుడి అపహరణ కలకలం రేపింది. సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటల సమయంలో సుమారు రెండున్నరేళ్ల వయస్సున్న వేదాంష్ అనే బాలుడిని ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి అపహరించినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి.. పోలీస్ కమిషనర్ ఆదేశాలు, పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టౌన్-1 పోలీసులు, CCS, క్రైమ్, సివిల్, టెక్నికల్ టీమ్స్ సమన్వయంతో దర్యాప్తు చేపట్టాయి.
బాలుడి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లోని CCTV కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు.. సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అనుమానితుల కదలికలను గుర్తిస్తూ రాత్రింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగించారు.
పోలీసుల నిరంతర దర్యాప్తు ఫలితంగా.. కేవలం 24 గంటల్లోనే సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ గ్రామంలో బాలుడి ఆచూకీని గుర్తించారు. బాలుడు వేదాంష్‌ను సురక్షితంగా రక్షించి నిజామాబాద్‌కు తీసుకువచ్చారు.
ఈ కేసులో మెదక్ జిల్లా నిజాంపేట్ గ్రామానికి చెందిన, ప్రస్తుతం మేడ్చల్‌లో నివాసం ఉంటున్న కోతాడి సుజాత, వయస్సు 30 సంవత్సరాలు, కోతాడి యెల్లం, వయస్సు 38 సంవత్సరాలను నిందితులుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలుడికి అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించి, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
కేసును కేవలం 24 గంటల్లో ఛేదించి బాలుడిని సురక్షితంగా రక్షించడంలో టౌన్-1, CCS, క్రైమ్, సివిల్, టెక్నికల్ టీమ్స్‌తో పాటు సంగారెడ్డి జిల్లా పోలీసుల సహకారం కీలకంగా నిలిచింది.
ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన అధికారులు, పోలీస్ సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

























