మానవత్వాన్ని చాటిన రక్తదాత రవి
న్యాయవాదికి సకాలంలో రక్తం అందజేత
సంవత్సరంలో నాలుగు సార్లు రక్తదానం.. రెండుసార్లు ప్లేట్‌లెట్స్ దానం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది జోగుల గంగాధర్‌కు ఆపరేషన్ నిమిత్తం ఒంటిమామిడి ఆర్వీఎం ఆసుపత్రిలో ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలను సంప్రదించారు.
వారి విజ్ఞప్తికి స్పందించిన డాక్టర్ బాలు.. దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్కబత్తిని రవికుమార్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన రవికుమార్ ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇది ఆయన 43వ సారి రక్తదానం కావడం విశేషం.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. నేటి యువతకు రవికుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయడంతో పాటు రెండుసార్లు ప్లేట్‌లెట్స్ దానం చేస్తూ ప్రాణదాతగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు.
డబ్బుతో కొనలేని విలువైన రక్తాన్ని దానం చేసి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడానికి డబ్బు అవసరం లేదని.. మానవత్వం ఉంటే చాలని రవికుమార్ నిరూపిస్తున్నారని అన్నారు.
సకాలంలో రక్తం అందకపోతే కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. యువత రక్తదానానికి ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 43వ సారి రక్తదానం చేసిన రక్తదాత లక్కబత్తిని రవికుమార్‌ను డాక్టర్ బాలు అభినందించారు.

























