పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ…
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు.
ఈ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగుతూ “చిన్న కుటుంబం – చింతలేని కుటుంబం”, “చోటి పరివార్ – సుఖీ పరివార్”, “హమ్ దో – హమారే దో” వంటి నినాదాలతో ప్రజలకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభా కారణంగా సహజ వనరులపై ఒత్తిడి పెరగడంతో పాటు కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతుందని అన్నారు. పర్యావరణ కాలుష్యం, పరిశుభ్రత సమస్యలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణలో శాశ్వత, తాత్కాలిక పద్ధతులను ప్రజలు అవలంబించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మానవహారం నిర్వహించి కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు.
తదనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో డాక్టర్ బి. రాజశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుందని పేర్కొన్నారు. అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా ఇద్దరూ సమానమేనని, కుటుంబ నియంత్రణపై ప్రతి అర్హులైన దంపతులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన PPIUCD, IUCD, అంతర ఇంజెక్షన్, ఓరల్ పిల్స్, కండోమ్ వంటి వాటిని అవసరానికి అనుగుణంగా వినియోగించాలని సూచించారు. అలాగే శాశ్వత కుటుంబ నియంత్రణలో మహిళలకే పరిమితం కాకుండా పురుషులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాల్లో విశేష సేవలు అందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని శాలువాలు, మెమెంటోలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ అరుణరేఖ, డీఐఓ డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ సికందర్, ఏవో సుమంత్ కుమార్, ఎస్‌వో రాజేశ్వర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖరం, డాక్టర్ నవ్య, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్‌ఈలు గన్‌పూర్ వెంకటేశ్వర్లు, షేక్ సలీం, వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

























