మెగా రక్తదాన శిబిరం విజయవంతం
96 యూనిట్ల రక్తం సేకరణ
రక్తదాతలకు హెల్మెట్లు అందజేసిన డీఎస్పీ మధుసూదన్, సీఐ నరహరి.
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీఎస్పీ మధుసూదన్, సీఐ నరహరి మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. సకాలంలో రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయని, అందుకే యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాతలు ప్రాణదాతలని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రక్తదాతలను ప్రోత్సహించే ఉద్దేశంతో వారికి హెల్మెట్లు అందజేయడం అభినందనీయమని అన్నారు. గత 19 సంవత్సరాలుగా రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్న కామారెడ్డి రక్తదాతల సమూహం సభ్యులను వారు అభినందించారు.
ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, కామారెడ్డి రక్తదాతల సమూహం ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ.. 2007లో 35 మందితో ప్రారంభమైన రక్తదాతల సమూహం ప్రస్తుతం 3,500 మందికి పైగా రక్తదాతలతో సేవలందిస్తున్న అతిపెద్ద రక్తదాతల సేవా సమూహంగా ఎదిగిందన్నారు.
19 సంవత్సరాల కాలంలో సుమారు 30 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందించినట్లు తెలిపారు. తలసేమియా బాధిత చిన్నారుల కోసం నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే 4 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ సేవలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు లభించిందన్నారు.
యువతలో రక్తదానంపై అవగాహన కల్పించేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రక్తదానం చేసిన దాతలను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు దాతల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,000 హెల్మెట్లు పంపిణీ చేసినట్లు డాక్టర్ బాలు తెలిపారు. సంవత్సరానికి మూడు సార్లు రక్తదానం చేసే దాతలను ప్రత్యేకంగా సత్కరిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన 96 మంది దాతలకు ప్రశంసాపత్రాలు, హెల్మెట్లు అందజేసి అభినందించారు. శిబిరంలో మొత్తం 96 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాష్, జమీల్ అహ్మద్, పర్ష వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, జలిగామ శ్రీకాంత్, కర్షక్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె. రషీద్, ఆర్కే విద్యాసంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి, దొంతి సుధాకర్, రంగ కిషన్‌తో పాటు పలువురు రక్తదాతలు పాల్గొన్నారు.

























